గ్రామసింహాల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

గ్రామసింహాల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

👉 పరిస్థితి విషమం

👉 మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలింపు 

👉 బండమీదిపల్లి గ్రామంపైనే మోజు

👉ఇంచార్జ్ గా ఉంటూ తమ గ్రామంపై ప్రత్యేక అధికారి సవతి ప్రేమ

👉 నాగులపల్లి గ్రామస్తుల విమర్శలు

నేటి ఇజం పెద్దేముల్ : గ్రామ సింహాల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కురువ కిష్టప్ప అనే వ్యక్తిపై గ్రామ సింహాలు ముకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచాయని బాధితుడిని వెంటనే తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు. నాగులపల్లి గ్రామంలో రోజురోజుకు శృతి మించిపోతున్న గ్రామ సింహాల దాడులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని గతంలో కూడా గ్రామ సింహాలు గుంపుగా ఏర్పడి గ్రామంలోని మేకలు, మూగజీవాలపై కూడా దాడి చేసి ప్రాణాలు సైతం తీశాయని గుర్తు చేశారు. ముఖ్యంగా నాగులపల్లి- బండమీదిపల్లి రెండు గ్రామాలకు ప్రస్తుతం ఒకే ఒక్క ప్రత్యేక అధికారిని నియమించడం వలన బండమీదిపల్లి గ్రామంపై తల్లిప్రేమను ప్రదర్శిస్తూ, ఇంచార్జ్ గా ఉన్న నాగులపల్లి గ్రామంపై సవతి ప్రేమను కనబరుస్తూ ప్రత్యేక అధికారి పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామసింహాల దాడుల నుండి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.