*భారీ వర్షాలలో వాగు దాటుతూ వ్యక్తిగల్లంతు*
*👉అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు..!*
– సంగెంకలాన్ బండల(దిండి) వాగులో గల్లంతు
– గతంలో 2రోజుల్లో శవమై తేలిన అన్న
– ప్రస్తుతం మొగులప్ప కోసం గాలింపు
– వాగువద్ద అధికారులు, నేతల టెన్షన్
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలోని బండల వాగు ఓ అన్నదమ్ముల పాలిట మృత్యువుగా మారింది. గతంలో ఇదే వాగులో గల్లంతైన అన్న రెండు రోజుల తరువాత శవంగా తేలాడు.
ప్రస్తుతం తమ్ముడు కూడా ఇదే వాగులో గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన బొక్తంపల్లి మొగులప్ప(42) బండల వాగులో గల్లంతు అయిన సంగతి తెలిసిందే.
*సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2023 జులై 21వ తేది మొగులప్ప అన్న బొక్తంపల్లి పెంటప్ప కూడా ఇదే వాగులో గల్లంతు అయ్యాడు. అప్పట్లో కర్ణాటక రాష్ట్రంలో బందువుల అంత్యక్రియల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే రోజు పెంటప్ప కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. రెండు రోజుల తరువాత అదే గ్రామ సమీపంలోని ఓ పొలం వద్ద మృతదేహంగా లభ్యమయ్యాడు.*
తాజాగా పెంటప్ప సోదరుడు మొగులప్ప కూడా వాగు దాటే క్రమంలో గల్లంతు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం మొగులప్ప ఆచూకీ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాగు వద్ద అధికారులు, నేతల టెన్షన్
మరోవైపు సంగెంకలాన్ గ్రామంలో వాగులో మొగులప్ప గల్లంతు అయిన వార్త అంతటా వ్యాపించింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లడంతో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్,, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు.

